పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: వాసనత్రయలక్షణము :-
40. సీ. లోకానుసారియై లౌకికవృత్తుల
వసియించుటయు లోకవాస నండ్రు
శాస్త్రపద్ధతి తమోజపక్రతువ్రతముల
వర్తించుటయు శాస్త్రవాస నండ్రు
దేహశోషణఁ జేసి తీర్థయాత్రల కెల్ల
వడితిరుగుట దేహవాస నండ్రు
ఈమూఁడువాసన లిచ్ఛయించక దేశి
కులసేవ చేసి షడ్గుణము లణఁంచి
గీ. తత్త్వమస్యాదివాక్యతాత్పర్య మెఱిఁగి
తన్ను తాఁ గన్నపురుషుఁడ ద్వైతుఁడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: వ్యాధిత్రయలక్షణము :-
41. సీ. వాతంబునం దుద్భవం బైన రోగము
ల్బాగుగా నెనిమిదిపదులు నయ్యె
పైత్యమం దుద్భవం బైనరోగంబులు
దండిగా నెనుబదిరెండునయ్యె
శ్లేష్మందున జనించినరోగములును ని
న్నూటనిర్వదినాల్గు నుచితమయ్యె
త్రివిధరోగంబు లీతీరున మున్నూట
నెనఁబదినారును నెన్నికయ్యె
గీ. నట్టివ్యాధుల కాధారమైన దేహ
భ్రాంతి విడచినవాఁడు సద్భ్రహ్మవిదుఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.