పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: తాపత్రయలక్షణము :-
38. సీ. తాపత్రయంబుల ధర్మముల్వేర్వేఱ
వివరించి చెప్పెద విమలచరిత
దేహజన్యము లైన త్రివిధరోగంబుల
తాపదుఃఖంబు లధ్యాత్మికంబు
వ్యాళవృశ్చికచోరవ్యాఘ్రాదిభూతసం
భవదుఃఖములు నాధిభౌతికంబు
వర్షాశనీపాతయాయురగ్నిశిలాప
తనదుఃఖములు నాధిదైవకంబు
గీ. నిట్టితాపత్రయంబులఁ గొట్టివేసి
ధీరుఁ డగువాఁడు మోక్షాధికారియగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: ఈషణత్రయలక్షణము :-
39. సీ. కామధర్మార్థము ల్గలుగుటకై భార్య
నిచ్చ నుంచుటయు దారేషణంబు
సుతులు లేకున్న సుగతులు లేవనుచుఁ బు
త్రేచ్ఛనుండుటయ పుత్రేషణంబు
దానధర్మములచే తరియింతు నని ద్రవ్య
మిచ్చయించుటయు ధనేషణంబు
దారాది కేషణత్రయములచేతను
నవనిలో సౌఖ్యంబు లనుభవించి
గీ. పుణ్యలోకంబు లెల్లనుఁ బొందవచ్చు
గాన మీలోన నైక్యమార్గములు గావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.