పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: అష్టపాశముల నిర్ణయము :-
36. సీ. తల్లిదండ్రియు భార్య తనయులు మిత్రులు
ధనము సహోదరు ల్తనువులైన
అష్టపాశంబులు నమరి బంధనములచేఁ
దగిలుండు నరులు నీధరణియందు
అత్తమామల బావ లల్లుండు కోడండ్రు
వదినెలు మఱదండ్రు మఱఁదు లనుచు
తాపత్రయంబులఁ దగిలి వర్తించుచు
మత్తులై మనుజులు మందమతిని
గీ. సాధుసజ్జనసంగతి సలుపలేక
మోక్షమార్గంబు నెఱుఁగరు మోహరహిత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: మలత్రయలక్షణము :-
37. సీ. పరమాత్మ మెఱుఁగక తెరుపు మరుపుచేత
గాత్రపుత్రకళత్రమిత్రులందు
సక్తుఁడై కడలేని సంసారవార్ధిలో
మునిగితేలుట నెల్ల యణవమలము
పరద్రవ్యమాపేక్షపడి పరజనులకు
నపకృతిసేయు మాయామలంబు
పుణ్యపాపములచేఁ బుట్టుచావులను ని
ర్మించుచుండుటయుఁ గార్మికమలంబు
గీ. మూఁడుమలముల విడువక ముక్తిపథము
గాన లేరైరి పామరమానవులును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.