పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: అష్టదిక్పాలకులస్థలనిర్ణయము :-
32. సీ. భ్రూమధ్య జంభారిపురంబుండు మఱియును
నగ్నిహోత్రునిపురం బక్షియందు
దక్షణకర్ణమం దంతకుపురముండుఁ
దత్పార్శ్వమున యాతుధానపురము
పరగఁ బృష్ఠమునందు వరుణునినగరంబు
పవనపురంబు నాపార్శ్వమందు
వామకర్ణమునందు వరకుబేరపురంబు
హరునిపురము దక్షిణాక్షియందు
గీ. శిరమునడుమను నుండు సుస్థిరముగాను
కుంఠితము గాన నీదు వైకుంఠపురము
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: షడూర్ములలక్షణము :-
33. సీ. పృథివి జీవులకెల్ల క్షుధతృష్ణలును రెండు
ప్రాణధర్మములని పలుకఁబడెను
శోకమోహంబులు శోధింపఁగా మనో
ధర్మంబు లని వాని దలఁపవలయు
జననంబు మరణంబు జడరూపమైనట్టి
దేహధర్మములని తెలియఁబడెను
ఇవి షడూర్ము లటంచు వివిధమార్గంబుల
వివరించి వీనిని విడచి నిన్ను
గీ. సద్గురూక్తంబుగాఁ గన్నసజ్జనుండు
నిష్కళబ్రహ్మమై యుండు నిగమవినుత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.