పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ఇడాపింగళసుషమ్ననాడులలక్షణము :-
30. సీ. ఇడయు పింగళయును గుడియెడమలనుండు
నడుమ సూక్ష్మసుషమ్న నాడియుండు
నీనాడి రంధ్రమధ్యమునందు సూర్యసో
మాగ్నివిద్యాక్షరమాయ యాత్మ
సప్తసముద్రము ల్సప్తపర్వతములు
చతురాగమంబులు శాస్త్రములును
పంచభూతములు సప్తద్వీపములు లోక
ములు గుణంబులు మంత్రములు కళలును
గీ. బిందునాదము దిగ్వాయుబీజమాది
సకలదృశ్యపదార్థము ల్సమతనుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: చతుర్ధలోకస్థులనిర్ణయము :-
31. సీ. అతలంబు పాదము ల్వితలంబు గుల్ఫలు
జంఘలు సుతలంబు జానులందు
నుండు తలాతం బూరువులందు భూ
తలము గుహ్యము రసాతలమునుండు
కటిని పాటాళలోకము నాభిభూలోక
ముండు భువర్లోక ముదరమందు
స్వర్గంబు హృదియుఁబక్షము మహర్లోకంబు
ఘనజనుర్లోకంబు గళము బొమల
గీ. మధ్యమందు తపోలోక మమరు మూర్ధ్ని
సత్యలోకము నీనివాసస్థలంబు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.