పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: గుణత్రయవిభాగలక్షణము :-
28. సీ. సాత్వికగుణునికి సగము రాజసము రా
జసములో సగము తామసమునుండు
రాజసగుణుని కర్ధము సత్వమందుండు
సత్వంబులోను దామసము సగము
తామసగుణుని కర్ధము రాజసము రాజ
సమునకు సత్వంబు సగమునుండు
త్రిగుణములీరీతి దేహములందుండు
సాత్వికగుణ ముండు సజ్జనుండు
గీ. గురుముఖంబున మీరూప మెఱుఁగుచుండు
త్రిగుణరహితుండు వర్ణింప నగణితుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: దశనాడులస్థాననిర్ణయము :-
29. సీ. గాంధారిహస్తిని ఘననాళములు రెండు
నేత్రద్వయంబుల నిలిచియుండు
నమరిన యూర్మిళ లనునాళములు రెండు
కర్ణద్వయంబులఁ గలసియుండు
పరజిహ్వనాడియు వక్త్రంబునందుండు
నాభిని శంఖినీనాళముండు
కులహాసినీ వాలికూడి రత్నాహ్వయ
గుదగుహ్యములయందుఁ గుదిరియుండు
గీ. కంఠమందున యశ్విని గలిగియుండు
క్షుధయుఁ దృప్తియునెఱింగించుచుండు నెపుడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.