పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: రాజసగుణలక్షణము :-
26. సీ. కామంబు క్రోధంబు గర్వంబు గలుగుట
కామ్యసంగతులహంకారపడుట
పరరాష్ట్రములమీఁద బంతంబుసేయుట
పరధనంబులఁ జూచి భ్రాంతిపడుట
వారకాంతల మెండు వాంఛించుచుండుట
నేరము లెన్నైనఁ గోరి వినుట
డంబ ముద్యోగమార్గంబుల మెలఁగుట
యుద్ధరంగమున సన్నద్ధమగుట
గీ. భోగభాగ్యంబుఁ గోరుట పొగడుకొనుట
లాలితంబుగ రాజసలక్షణములు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: తామసగుణలక్షణములు :-
27. సీ. అజ్ఞానవృత్తి మోహాంధకాతయుతుండూ
భూరినిద్రాసక్తి బొందియుండు
ఎదురు తన్నెఱుఁగక విదళించి యదలించుఁ
గోయును తోయును గోపఁబడును
అతిభోజనప్రియుం డతిపానధర్ముండు
పాతకంబుల పట్టుఁబడుచు నుండు
దూషించుచుండు దుర్భాషలు భాషించు
రోషములాడిన రోయకుండు
గీ. బుద్ధిలోలుండు సంసారబద్ధకుండు
కుటిలసంగుండు తామసగుణరతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.