పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: సుషుప్త్యవస్థలక్షణము :-
24. సీ. కంఠదేశమునహంకారచిత్తము లుంచి
ధీమనంబుల రెండి దీసికొనియు
కారణదేహహృత్కమలమందునఁ జేరి
యజ్ఞానసన్నిదియందు నిలిచి
నది సుషిప్త్యనఁబడు నచట రెంటిని నుంచి
తానవిద్యనుగూడి లీనమైన
నదియు గాఢసుషుప్తి యనఁబడు మహిమీద
సర్వంబు నెడబాసి స్మరణతప్పి
గీ. యుండ తుర్యం బటంచును యోగివరులు
చాటుచుందురు జనితమై జనుచు నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: సాత్వికగుణలక్షణము :-
25. సీ. సత్యవ్రతాచారసంపన్నుఁడై యుండు
సత్కర్మక్రియలెల్ల సలుపుచుండు
తపము మౌనంబు నిత్సాహంబు గతినుండు
ధర్మమార్గంబులు దలఁపుచుండు
శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండు
శాస్త్రపురాణము ల్సలుపుచుండు
ధ్యాన సుజ్ఞానసన్మానము ల్గలిగుండు
శ్రేష్ఠదానంబులు సేయుచుండు
గీ. ధైర్యనిశ్చయబుద్ధి సద్భక్తినుండు
సకలభూతసముండు సాత్వికయుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.