పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: పంచభూతాంశగుణములు :-
14. సీ. నరము లస్థులు చర్మనఖరోమమాంసము
ల్భూగుణంబులు స్వేదమూత్రరక్త
ములు శుక్లశోణితంబులు వారిగుణములు
క్షుత్పిపాసాలస్యసుప్తిసంగ
ములు వహ్ని గుణములు చలనధావనకంప
నాకుంచనప్రసార్యాదికములు
పవమానగుణములు భయవికారంబులు
క్రోధలజ్జయు నభోగుణము లవియుఁ
గీ. బంచభూతాంశగుణములఁ బాఱదోలి
నీస్వరూపంబు గనువాడు నిర్మలుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: పంచకోశముల నిర్ణయము :-
15. సీ. అన్నరసంబుతోనైన శోణితశుక్ల
మయమైన యాదేహ మన్నమయము
పంచప్రాణంబులు ప్రబలికర్మేంద్రియ
పంచకమును గూడి ప్రాణమయము
జ్ఞానేంద్రియము లైదు మానసం బొక్కటి
కూడియైనవి మనోకోశమయము
చెలఁగి జ్ఞానేంద్రియములు బుద్ధియునుగూడి
విజ్ఞానమయమున విద్యయందు
గీ. మనసు కలసిన యానందమయము నిట్లు
పంచకోశములకు సాక్షిపరుఁడ వీవ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.