పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంశములనే యీకవి యట్టిశైలినే యనుకరించి చెప్పెను. ఛందోవ్యాకరణప్రతిబంధకములవలనను నూటయెనిమిదిపద్యములలో విషయమునంతయు నిముడ్చవలసివచ్చుటవలనను భావములు పద్యములలోఁ గొన్నిచోటుల నంత విస్పష్టముగా లేవు. కొన్నిపద్యములలో ననుప్రాసముంటవలన విషయశూన్యముగా నున్నను జదువుటకు సరసముగా నున్నవి.

ప్రపంచోత్పత్తి మొదలుకొని నరప్రమాణము ధాతువులు చక్రములు పంచీకరణము నాడులలక్షణము ఉపదేశక్రమము యోగాదికములు లోనగు నంశములను దీసికొని కవి సుబోధకముగ సరసముగాఁ గొన్నిపద్యములను వ్రాసియున్నాఁడు. కొన్నిపద్యములయందు శ్రుతిప్రతిపాదితములగ వాక్యములు సవిమర్శవ్యాఖ్యారూపముగాఁ జర్చింపఁబడి యున్నవి గాన నీశతకము వేదాంతవిషయజిజ్ఞాసువుల కవశ్యపఠనీయము.

కవి నూరుసంవత్సరములక్రింద నుండియుండును. సీతారామాంజనేయము నూఱుసంవత్సరముల కావలిది గావునను శతకము అఱువదేండ్లక్రిందఁ బ్రథమముద్రణ మగుటవలనను ఈనిర్ణయము సరియైనదనియే మాతలంపు.

నందిగామ ఇట్లు భాషాసేవకులు,
1-6-26 శేషాద్రిరమణకవులు,

                                                      శతావధానులు