Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

71


సంస్కరణల సందర్భమున నిట్లు సాకులు చెప్పుచున్నారు! ఈ కమిటీవారి సూచనలను సైమను కమిటీవారును తమ నివేదికలో అంగీకరించినారు.

ఇటీవల శాసింపబడిన నూతన ఇండియా రాజ్యాంగ చట్టమును చేయుటలో బ్రిటిషువా రీ నెపమున కొంత రాజ్యాంగ నాటకము నాడి సంస్థానములపైన ఆంగ్లరాజమకుటమునకుగల సర్వాధికారములను పురస్కరించుకొని ఈసంస్థానములను తమ కీలుబొమ్మలుగా నుపయోగించుకొని భారతదేశ ప్రజా ప్రతినిధుల ప్రభుత్వమునకు ఆటంకములుకలిగింప గల అనేక బందోబస్తులను జేసికొనినారు.

ఈ సంస్థానముల రాజ్యభాగము 824000 చతురపు మైళ్లు వైశాల్యము కలిగియున్నను దీని జనసంఖ్య బ్రిటిషు భూభాగముతో పోల్చిచూచినచో చాల హీనముగ నున్నది. దీనిలో హైదరాబాదు, మైసూరు, బరోడా రాజ్యములు గాక తక్కిన రాజ్యములు రాజపుత్రస్థానమువంటి నిరుపయోగమైన పంటలులేని భూములుగనో లేక అడవి ప్రదేశములో కొండప్రదేశములుగనో యున్నవి. దీనికి కారణము ఆంగ్లేయులు మంచి భూభాగము లెల్ల పూర్వరాజులనుండి లాగుకొని బ్రిటిషు ఇండియాలో చేర్చివేయుట. ఈ రాజులను నాయకులను యుద్ధములం దీమారుమూలలకు తరిమియుండుట 1857 తరువాత క్రొత్తరాజ్యాక్రమణలు చేయక పోయినను ఆనాటికి మిగిలిన సంస్థానము లిట్టిస్థితిలో మిగిలెను.