బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
65
సహకారిగా నుండవలెను. అతడు వారి సర్వాధికారమును శిరసావహించవలెను. ఇతరరాజులతో నెట్టి సంబంధమును కలిగియుండరాదు.
6 వ షరతుప్రకారము సంస్థానము యొక్క ఆదాయములో నాలుగవవంతును 5 సంవత్సరములవరకు కప్పముగా చెల్లించి తరువాత ఆదాయములో 8లో 3 వంతులు శాశ్వతముగా కప్పము గానిచ్చుచుండవలెను. 8 వ షరతు ప్రకారము బిటిషు గవర్నమెంటువారు కోరినప్రకారము ఉదయపుర సంస్థానము సైన్యముల నుంచుకొనవలెను. హేస్టింగ్సు హయాములో స్వదేశ సంస్థానములపైన నిట్లనేక కఠిననియమములు, హెచ్చు కప్పములు విధింపబడుచుండెను. అందువలన వారి ఖజానాలు వట్టివైపోయి వారు ప్రజలపైన భరింపలేని అత్యధికపన్నులు విధించుచుండిరి. డల్‌హౌసీకాలములో నీసంస్థానాధీశులను పీడించుట, అవమానించుట, వారి రాజ్యములను లాగికొనుట విచ్చలవిడిగా జరిగెను. ఈ సంస్థానాధీశులు ప్రజలును గూడ యీబాధలు పడిపడి తుదకు 1857 విప్లవములో పాల్గొనుటకు మొదట సిద్ధపడిరి గాని ఆంగ్ల పరిపాలకులు చాలమంది సంస్థానాధీశులకు ఆసలుగొల్పి కొనివేసి లోబరచుకొనిరి.
అందుకే విక్టోరియా రాజ్ఞి ప్రకటనలో "స్వదేశ సంస్థానాధీశుల హక్కులు, దర్జాలు, గౌరవములు మా స్వంతవానివలెనే గౌరవింతుమనియు సంధినియమములు పాటింతుమనియు” కొన్ని మాటలు చేర్చబడినవి.