బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
59
ప్రోత్సహించి తంత్రమును నడిపినాడు. కొందరంగీకరించినచో అందరును దారికివత్తురు. ఇట్లుచేసినచో ఫ్రెంచివారి పలుకుబడి తగ్గిపోయి ఆంగ్లేయుల పలుకుబడి హెచ్చును. ఆంగ్లేయులకిక భయముండదు స్వదేశరాజులు కోరలు దీసిన పాములగుదురు. స్వదేశరాజుల స్వాతంత్ర్యము నాంగ్లేయు లంగీకరించి వారి కపాయము రాకుండ సహాయము చేయుచుండుటకు స్నేహముగ నుండుటకు పూచీపడి ఆంగ్లసైన్యములను తమరాజ్యమున నుంచుకొని వాని కగువ్యయముక్రింద కొంతసొమ్మునో కొంత అయివజువచ్చు రాజ్యమునో యిచ్చునట్లును బ్రిటిషుప్రభుత్వము అనుమతిలేకుండా యితరులతో యుద్ధముగాని శాంతి సంధిగాని చేసికొనకుండునట్లును తమరాజ్యస్థానమున నాంగ్లేయ ప్రభుత్వ ప్రతినిధిని రాయబారిగ నుంచుకొనునట్లు ఒడంబడికలు వ్రాయించుటకును రాయబారములు నడిపెను.
ఫ్రెంచివారి యొత్తిడివలన స్వదేశ సంస్థానాధీశుల సహాయము ఆంగ్లేయుల కత్యవసరమయ్యెను. ఏదోవిధముగా వారిని మంచిచేసుకొనవలయును. మైసూరు రాజుగానుండిన టిప్పు సుల్తానుకు మార్క్వెస్ ఆఫ్ వెల్లస్లీ వ్రాసిన లేఖలో నీ యుద్దేశము స్పష్టముగా కనబడుచున్నది. “సగౌరవమైన ఈ లేఖలోని సంగతులు తమరు చిత్తగించినచో నీ క్రింది సంగతులు విశదముకాగలవు. ఫ్రెంచిజాతివారు మానవధర్మమును, గౌరవమును, మతమును పాడుజేసినారు. ప్రపంచములోని అన్ని రాజరికములు, పరిపాలనాక్రమములు, మతములు, వారి యాశాపిశాచమునకు తనివితీరని కొల్లకు నాశనమునకు గురికా