Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

57


బట్టి రాజులు నవాబులు ఆంగ్లేయ కంపెనీతో స్నేహముగా నుండునట్లును ఉభయులు ఒండొరులకు సహాయులై యుండునట్లును, ఉభయులకు రక్షణకొరకు ఆంగ్లేయసైన్యములను సంస్థానములలో నుంచునట్లును ఏర్పాటు చేసెను. కొన్ని సంధిపత్రములందు కంపెనీ ప్రభుత్వమునకు విధేయులై యుండవలెనను మాటను చల్లగాజేర్చినాడు. నెపోలియను భయము తీరిన పిమ్మట హేస్టింగ్సు గవర్నరు జనరలుగా వచ్చిన వెంటనే క్రొత్త రాజ్యనీతి ఖచ్చితముగా అమలు జరుపబడెను. వెలస్లీ కాలమున 1802 లో పీష్వాతో చేయబడిన సంధిలోనే అతని సర్వాధికారములు తీసివేయబడు సూచనలు కలవు.

1806 లో షాఆలంచక్రవర్తి చనిపోయినను 1832 వరకు ఢిల్లీపరగణాలు చక్రవర్తి కొమారుని పేరుతోనే వ్యవహరింపబడినను హేస్టింగ్సు కాలమునుండి మొగలాయి చక్రవర్తి అధికార మావంతయైన మిగులలేదు. 1813 లోనే తక్కిన మహారాష్ట్రరాజులపైన పీష్వాకుగల సర్వాధికారము అదృశ్యమైనది. ఆనాటికి దేశములో నాంగ్లేయకంపెనీ తప్ప యింకొక బలమైన ప్రభుత్వసంస్థ లేనేలేదు. అందువలననే కంపెనీవారు సర్వాధికారులనియు, ఈ సంస్థానాధీశులు సామంతులనియు హేస్టింగ్సు స్పష్టముగా ప్రకటించి తన సంధిపత్రములం దీ సంగతిని వివరించినాడు.

బ్రిటిషువారు స్వదేశ రాజులపట్ల చూపిన గౌరవము, స్నేహము, అధికారము, కాలపరిస్థితిని బట్టి మారినవి. వెల్లస్లీ 1798 మొదలు 1805 వరకు గవర్నరు జనరులుగ నుండెను.