పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/737

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
247
 


విశేషాధికారములు గల ఈ నూతనరాజ్యాంగమువలన భారతీయుల దాస్యబంధనములు మఱింత బిగియుననుట స్పష్టము. శాసననిర్మాణము ద్రవ్యపద్ధతి న్యాయపరిపాలన సైన్యము పోలీసులకు సంబంధించిన నిజమైన అధికారములన్నియు సామ్రాజ్యయంత్రముయొక్క చేతులలోనే యుండును. ఇదిగాక దేశాభివృద్ధికి విముఖులగు 'ఫ్యూడల్ ' వర్గములు - సంస్థానాధిపతులు భూస్వాములు బలవంతులుగా చేయబడి ఈ సామ్రాజ్యత్వమునకు సహాయభూతులుగా చేయబడినారు. గవర్నరుల నిరంకుశపరిపాలనను విమర్శించుటకు గూడ వీలులేకుండ శాసనసభలకు వాగ్బంధము గావింపబడినది.[1]

.

  1. శాసనసభలలోని వాక్స్వాతంత్ర్యము: 86వ సెక్షనునుబట్టి రాష్ట్రీయశాసనసభలలోని వాక్స్వాతంత్ర్యమునకు భంగకరములగు రెండు విధులు కలవు. (1) ఫెడరలుకోర్టు హైకోర్టు జడ్జీల ప్రవర్తననుగూర్చి శాసనసభలు చర్చింపరాదు. (2) ఒక చిత్తుచట్టమునుగూర్చిగాని దానిలో నొక పరిచ్ఛేదముయొక్క సవరణనుగూర్చిగాని శాసనసభలో చర్చించుట, రాష్ట్రముయొక్క శాంతిభద్రతలను గాపాడుటకు గవర్నరుకుగల ప్రత్యేక బాధ్యతకు భంగకరమని అతడు తనస్వతంత్ర వివేచన నుపయోగించి నిర్ణయించినచో ఆ తరువాత ఆ చిత్తుచట్టమునుగూర్చి సవరణనుగూర్చి శాసనసభలో నెట్టిగ్రంథము జరుపబడరాదని గవర్నరు నిషేధింపవచ్చును. అంతట దానినిగూర్చి ఎట్టిచర్చలు జరుగ రాదు.

    శాసనసభలయొక్క ఆచరణ విధులనుగూర్చిమద్రాసుగవర్నరు కొన్ని నిబంధనలను జేయుచు వాక్స్వాతంత్ర్యమును గూర్చి చట్టములోలేని మరికొన్ని క్రొత్తనిషేధములను గల్పించినాడు. 26 వ నిబంధననుబట్టి శాసనసభలో నేదైననొకప్రశ్న అడుగబడులోపుగా ఆ ప్రశ్న గాని దానిలో నొక భాగముగాని చట్టమునుబట్టి తన స్వతంత్ర వివేచనను స్వబుద్దిని ఉపయోగించవలసిన అధికారములకు భంగముకలిగించును గనుక దానిని నిషేధించుచున్నానని గవర్నరు తన స్వతంత్ర వివేచన నుపయోగించి శాసనసభాధ్యక్షునికి తెలిపినచో ఆ ప్రశ్న సభాకార్యక్రమమున చేర్చబడదు. చేర్చబడియున్నచో శాసనసభాధ్యక్షుడు దానినడుగనివ్వకూడదు. 116 వ నిబంధననుబట్టి గవర్నరు ఏ తీర్మానము నైనను అట్లు నిషేధింపవచ్చును. ఇంకొక నిబంధననుబట్టి శాసనసభలోని సామాన్య ఉపపాదనములు అడ్జర్‌స్ మెంటు తీర్మానములుకూడా గవర్నరు నిషేధింపవచ్చును. ఇట్లు అసలే యధికారములేని శాసనసభలకు వాగ్బంధనముకూడా చేయబడుచున్నది. ఈ ఉదాహరణమును బట్టియే క్రొత్తరాజ్యాంగముక్రింద రాష్ట్రీయగవర్నరు లెంతఉదారముగా పరిపాలింతురో తేలుచున్నది.