పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/735

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
245
 


భారతదేశపరిపాలనకు మూలాధారము పోలీసుబలమేగనుక దీనిని గూర్చిన అధికారమును రాజకీయ పార్టీలకు చెందిన మంత్రులచేతులలో పెట్టుటకు బ్రిటీషువారు ఇష్టపడరు. అందువలననే పోలీసుబలములను గూర్చి మంత్రులుచేసిన సూచనలను నిరాకరించుటకును, మంత్రులనుగాని శాసనసభలనుగాని ఆలోచింపకయే తనకుతోచినట్లు చేయుటకును గవర్నరుకు విపరీతాధికార మివ్వబడినది. అవసరమైనచో అతడు మంత్రులనే తీసివేయవచ్చును. శాసనసభను కూడ నిలయము (డిజాల్వు) చేయవచ్చును. శాంతిభద్రతలను గవర్నరుయొక్క ప్రత్యేకబాధ్యత కనుగుణముగా పరిపాలింపగల మంత్రులును పరిపాలక వర్గమును లభింపనిచో రాజ్యంగమే భగ్నమైనట్లుగా ఎంచి గవర్నరు తన కవసరమని తోచిన అధికారములనెల్ల తానేవహించి ప్రభుత్వము చలాయించవచ్చును. ప్రతిరాష్ట్రములోను రహస్య పోలీసువ్యవహారములు మంత్రుల కెంతమాత్రము లోబడక గవర్నరుజనరలు అధికారముక్రింద “ సెంట్రల్ ఇంటెలిజెన్సు బ్యూరో'కు ఉపశాఖగానుండును. పై సంగతి సందర్భములవలన రాష్ట్రీయగవర్నరు లెట్టి నిరంకుశులుగ సర్వాధికారులుగ నున్నారో వెల్లడియగుచున్నది. మంత్రులును శాసనసభలును గవర్నరుల ధయాధర్మములపైన ఆధారపడి యుందురనుటకు సందియములేదు. అమితములగు అధికారములును బలమునుగల ఈగవర్నరులు ప్రతిరాష్ట్రములోను సామ్రాజ్య విధానముయొక్క పునాదులను గట్టిపరతురనుటకు సందియములేదు.