పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

203

6. శాసన సభలతో నిమిత్తము లేకుండా 'గవర్నరు జనరలు చట్టము' లనుపేరుతో శాసనములనే చేయుట.

7. శాసనసభలను సమావేశ పరచుట, సమావేశముల నింకొక తేదీకి వాయిదావేయుట, సభలను చాలింపు చేయుట.

8. రెండు శాసనసభలను కలిపి సమావేశ పరచుట.

9. ఏచిత్తు చట్టపు చర్చనైనను శాసన సభయందు ఆపుట.

10. శాసన సభవారు వ్యతిరేకముగా తీర్మానించినను గూడ ఏచర్యయైనను జరుపుట.

11. రాజ్యాంగయంత్రము నడువని సందర్భము వచ్చినచో అందు ఏ భాగమునైనగాని సర్వసంస్థలనుగాని మాపుచేసి ఆయధికారములెల్ల తానే వహించి చలాయించుట.

ఈ అధికారము లన్నియుగాక గవర్నరు జనరలుకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు ప్రసాదింపబడినవి. వీనిని నిర్వహించుటలో నతడు కేవలము నిరంకుశాధికారములను చలాయించును. అవి యేవియన :

1. యావద్భారత దేశముయొక్క లేదా అందే దైన నొక ప్రదేశముయొక్క శాంతి భద్రతలకు తీవ్రమైన అపాయము వాటిల్లకుండ కాపాడుట.

2. ఫెడరలు సంయుక్త ప్రభుత్వముయొక్క ఆర్థిక క్షేమమును పరపతిని సంరక్షించుట.