Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

199


బడినవి. వీనిని ఇండియారబ్బరువలె గవర్నరు జనరలు తన యిచ్చవచ్చినట్లు విపరీతముగా సాగదీసి అన్వయించి, వ్యవహరించవచ్చును. (9వ శెక్షను 3 వ సబు శెక్షను). 37 వ శెక్షను ప్రకారము ఫెడరలు శాసనసభలు గవర్నరు జనరలుయొక్క అనుజ్ఞను ముందుగా పొందనిది ద్రవ్యసంబంధములగు శాసనాధికారములు చలాయింపవీలులేదు. ఇట్లు నిషేధింపబడిన వానిలో పన్నులు విధించుట, వ్యయములు చేయుట, అప్పులు తెచ్చుట, పూర్వపుద్రవ్య వ్యవహారములును చేరియున్నవి. కోశాధికారములేని ఇట్టి బాధ్యతాయుత ప్రభుత్వము ప్రపంచములో కని విని యెరుగనిదిగ నున్నది.

ఈవిషయములో నీక్రొత్తరాజ్యాంగము 1919 నాటి ప్రాత రాజ్యాంగము చేసిన యేర్పాటులనే నిలిపి యుంచినది. ఇంక నితర ఆర్థిక ద్రవ్యవిషయములందు శాసనసభలను కట్టిపెట్టుటకు క్రొత్త బంధనములను నిర్మించుచున్నది. అందు ముఖ్యమైనది బ్రిటీషువర్తకులకు పెట్టుబడిదారులకు ప్రత్యక్షముగా గాని ప్రచ్చన్నముగాగాని ఏమాత్రమైన హాని కలిగింప గల శాసనము దేనినైనను శాసనసభలు చేయుటకు వీలులేకుండ గావింపబడిననిషేధము.

రాజ్యాంగచట్టముయొక్క 12వ శెక్షనునుబట్టి గవర్నరు జనరలుయొక్క ప్రత్యేక బాధ్యతలలో బ్రిటీషుదీవుల నుండి ఇండియాలోనికి దిగుమతి చేయువస్తువుల విషయమై విచక్షణ చూపునట్టి లేదా, కష్టనష్టములు కలిగించునట్టి చర్యలు జరుపకుండా కాపాడుట యొకటి. అట్టిప్రత్యేక బాధ్యతను నిర్వ