Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

179


IV

బ్రిటిషు పార్లమెంటుయొక్క సర్వాధికారము

ప్రతిరాజ్యాంగములోను 'ప్రభుత' (Sovereignty) అను సర్వాధికారమే ప్రధానమగు విషయము. అన్ని స్వతంత్ర ప్రజాప్రభుత్వములందు ఈప్రభుత లేక సర్వాధికారము ప్రజలయందే యుండును. ఇది ప్రజలవలన ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధిసంస్థరూపము దాల్చును. ఈ సంస్థవలననే ప్రభుత్వశాఖ లన్నియు తమ యధికార సత్తాలను పొందును.

భారతదేశము బ్రిటీషు దీవుల అధికారమునకు లోబడిన పాలితరాజ్యము. అందువలన 'ప్రభుత' భారతదేశ ప్రజలయందు గాక బ్రిటీషువారి పార్లమెంటులోనే నెలకొనియున్నది. కాబట్టి మనదేశముయొక్క ప్రభుత్వము ఏ రూపముకలదై యుండవలెనో నిర్ణయించునది బ్రిటీషు పార్లమెంటే [1] మఱియు బ్రిటీషు పార్లమెంటువారే తమ మంత్రియగు ఇండియా రాజ్యాంగ కార్యదర్శిద్వారా భారతదేశ వ్యవహారముల పైన అదుపు ఆజ్ఞలను పైతనిఖీని చెలాయించుచుందురు. భారతదేశ పరిపాలనము యొక్క అన్ని ముఖములందును గూడ జోక్యము కలిగించుకొనుటకు ఇండియా రాజ్యాంగ కార్యదర్శికి అపరిమితములగు సర్వాధికారము లొసగబడియున్నవి.

  1. బ్రిటీషు పార్లమెంటు ఇంగ్లీషు ప్రజాప్రతినిధుల సంస్థగాని మన ప్రతినిధికాదు. అందువలన నది భారతదేశమును బ్రిటీషు ప్రజల ఆర్ధిక క్షేమము కొరకే ఉపయోగించి తీరును.