పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

177


హక్కులు, బ్రిటీషుసరకుల దిగుమతి, బ్రిటీషు వర్తకుల, వృత్తివంతులహక్కులు, సంస్థానములహక్కులు, గవర్నరుజనరలుక్రింద నుండు శాఖల అమలు వ్యవహారములును, గవర్నరుజనరలుకు ప్రత్యేకబాధ్యతగల అధికారమండలములుగా సృజియింపబడి అందుకు సంబంధించినంతవరకు ఆతడు తనస్వబుద్దినే ఉపయోగించి చర్యతీసికొనవలెనని విధింపబడి అందుకు గావలసిన విశేషాధికారములతని కొసగబడినవి. ఇట్లేరాష్ట్రములందలి శాంతిభద్రతలు, అల్పసంఖ్యాకజనసంఘములహక్కులు, ప్రభుత్వోద్యోగులహక్కులు, బ్రిటీషువర్తకముయొక్క హక్కులు, సంస్థానములహక్కులు, గవర్నరుజనరలు జారీచేయు ఆజ్ఞలను అమలుజరుఫుట, గవర్నరుకు ప్రత్యేకబాధ్యతగల అధికారమండలములుగా చేయబడి ఆవిషయములకు సంబంధించినంత వరకు అతడు స్వబుద్ధినే వినియోగించి చర్యగైకొనవలెనని శాసింపబడి అందుకుగావలసిన విశేషాధికారము లతని కొసగబడినవి. అనగా ఈవిషయములందు వీరు మంత్రుల సలహాను త్రోసిరాజనవచ్చును. గవర్నరుజనరలుకును గవర్నరులకును ఇవ్వబడిన విశేషాధికారములకు సంబంధించినంతవరకు వీరు ఇంగ్లాండులోని బ్రిటీషుసామ్రాజ్యమంత్రియగు ఇండియా కార్యదర్శికి బాధ్యులై అతని యాజ్ఞలప్రకారము ప్రవర్తింతురు. అందువలన భారతదేశక్షేమముకొరకుగాక బ్రిటీషుసామ్రాజ్య క్షేమలాభములకొరకే వీరు తమ అధికారములను వినియోగింతురనుట నిశ్చయము.