పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

141

ఈ దారిద్ర్యమునకు ముఖ్యకారణము ఇచ్చటి బ్రిటీషు పరిపాలనయొక్క స్వభావమే. భారతదేశమునకువచ్చిన ఇంగ్లీషువారు లాభముపొంది ధనవంతులగుటకొర కీదేశభాగ్యభోగ్యములు నిరంతరప్రవాహముగా తరలించుటయే కారణము..

1865-1905 మధ్య నలుబది ఏండ్లలో భారతదేశదిగుమతులకన్న హెచ్చుగా పంపిన ఎగుమతులయొక్క విలువ 10000 లక్షల పౌనులు, లేక 1500 కోట్ల రూపాయలుండెననియు ఈ దేశప్రభుత్వవిధానమున నికరాదాయములో సగము సైన్యమునకు మూడవవంతు సివిలు పరిపాలనోద్యోగుల కొరకు సీమ కంపబడుచున్నదనియు జీతముల మొత్తము పెరిగిపోయినదనియు వ్యవసాయ క్షేమమున కెట్టి పనులుచేయక ఆంగ్లేయ వర్తకుల లాభముకొరకు రైళ్ళు నిర్మించబడినవనియు దేశ ప్రజలకు విద్యలేదనియు ఈ దేశములోని ఏడు లక్షల గ్రామములలో ఐదింట నాలుగు గ్రామములకు ఒక పాఠశాల కూడా లేదనియు 8 మందిలో 7 మంది బాలురు నిరక్షరకుక్షులుగా జీవించుచున్నారనియు నీ ప్రభుత్వ యంత్రచలన విధానము తక్షణమే మార్చనిచో నింకను ఘోరాన్యాయమైన స్థితి వచ్చుననియు గోఖలేగారు స్పష్టముగా 15-11-1905 లో లండన్ నేషనల్ లిబరల్ క్లబ్బు లో నుపన్యసించుచు చెప్పియున్నారు.