Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

79


సగముపైగా మ్రింగుచున్నది. ఇదిగాక ప్రపంచవిరుద్ధమగు ఉప్పుపన్ను విధించి బీదలను పీడించుట చిత్రము. సారాయము విక్రయముచేసి ప్రభుత్వము ధనము గడించుట యధర్మముగ నున్నది. ఇట్టి పన్నులపద్దతి స్వాతంత్ర్యముగల దేశములందు ప్రజ లంగీకరింపరు.

భరతఖండమున కావశ్యకములేని యుద్ధములకొరకు భరతఖండపు ఆదాయము దుర్వ్యయము గావింపబడినది. సామ్రాజ్యమును వృద్ధిజేసుకొనుటకును, ఇనుప దారులువేసి సైన్యముల రాకపోకలను సులభము చేయుటకును తమ సౌకర్యముల కొరకును ఇంగ్లాండులో ఋణములను దెచ్చిరట. నేడు 1200 కోట్ల రూపాయల ఋణము భారతీయులు భరింపవలెనట. దీనికయి ప్రతివత్సరము నింగ్లాండుకు వడ్డీని చెల్లించుటకు మన యాదాయమున చాల వ్యయమగుచున్నది.

ఇంగ్లాండునకు బోవున దీ ధనము మాత్రమే కాదు; మనకు దిగుమతులకన్న ఎగుమతులధికముగ నున్నందునను ఇంగ్లాండునకే చాలవరకు మన ముడిసరుకులు పోవుచున్నందునను వారికి చెల్లించుటకు సుంకముల క్రిందను వారికివచ్చు లాభముల క్రిందనుపోవు ధనము, ఇంగ్లీషు ఉద్యోగుల వేతనముల క్రిందను సంపాదనల క్రిందను పోవుధనమును మనకు గావలసిన వస్తువుల నింగ్లాండులో కొనుటవలన పంపుధనమును గలసి నిరంతరాయముగ పోవుచున్న ధన ప్రవాహము మనల బీదల జేసి వారిని ధనికుల జేయుచున్నది. ఇట్లు పోవుచున్న