బ్రిటీష్‌రాజ్యతంత్రము
27
చేసెదననియు వారిని నిరశనవ్రతము మానవలసినదనియు కోరీ వంగ రాష్ట్రప్రభుత్వమువారితో మాటలాడగా తుదకా ఖైదీల నందరిని అండమానునుండి మనదేశమునకు తెచ్చిరి. విచారణలులేకయే నిర్బంధమునందుంచబడిన 'డిటిన్యూ ' దారుణవాదులను మెల్లిగా విడచి వారిచర్యలు కనిపెట్టిచూచు పద్దతిని ఆండర్సన్ ప్రారంభించియుండెను. ఆ పద్ధతిని ఇంక నెక్కువజేసి నిర్బంధితులను చాలవరకు విడుదలజేసిరి. ఇక కొద్దిమంది అండమాను ఖైదీలు మిగిలిరి. వీరిలో చాలమంది వంగరాష్ట్ర ప్రభుత్వములోనివారు. 28 మంది బీహారువారు, 15 మంది సంయుక్త రాష్ట్రములవారు. వీరిని విడుదల చేయుట న్యాయమని కాంగ్రెసు అభిప్రాయము. ఆ ప్రకారము వీరిని విడుదలచేయుటకు మంత్రిమండలి సభలో ఆలోచించగా గవర్నరులు ఏదో మిష పైన జాగుచేయసాగిరి. వీరు రాజకీయ ఖైదీలు గారనియు దారుణనేరములకొరకు శిక్షింపబడ్డ నేరగాండ్రనియు గవర్నరు యొక్కవాదము. అందువలన వీరిని విడువరాదనిరి. వీరు దేశస్వాతంత్య్రము కొరకే దారుణ పద్దతులు ప్రయోగించుచు విప్లవమార్గముల నడచిన రాజకీయవాదు లనియు వీరుకూడ రాజకీయ ఖైదీలేయనియు మరియు నేటి రాజకీయ పరిస్థితులలో పూర్వమువలె హింసాపద్ధతు లనవసరమని గ్రహించి వీరు అహింసామార్గముల పోరాట పద్ధతులకు త్రికరణ శుద్ధిగా అంగీకరించుచూ మహాత్మునికి మాటనిచ్చినారనియు వీరిని విడుదలచేసి తీరవలెననియు మంత్రులు వాదించిరి.