బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
27
తంజావూరు
తంజావూరు అనేక శతాబ్దములనుండి స్వతంత్రరాజుల పరిపాలనక్రింద నుండిన చిన్న రాజ్యము. 1741 లో ప్రతాపసింహు డీ రాజ్యసింహాసనము నధిరోహించెను. ఆ నాడు ఫ్రెంచివారితో పోటీగానుండిన ఆంగ్లవర్తకకంపెనీవా రీ రాజుతో స్నేహము జేసికొనిరి. కొద్దిరోజులలో నీ ప్రతాపసింహుని సోదరుడు ఆ రాజ్యసింహాసనమును సంపాదించుటకు తనకు సాయపడినచో దేవికోటను, ఒక జాగీరును ఇచ్చెదనని ఆంగ్లేయులతో రాయబారము నడిపెను. అంతట వీరు దాని కాసపడి మిత్రద్రోహము చేయుటకుగూడ వెనుదీయక ప్రతాపుని సింహాసనభ్రష్టుని చేయుటకొరకు సైన్యమునంపిరి గాని యీ ప్రయత్నము విఫలమయ్యెను. మరల నింకొక సైన్యమునంపి దేవికోటను పట్టుకొని తమ్ము దేవికోటలో కదలకుండ, నుండనిచ్చినచో తమ క్రొత్తస్నేహితుని విడనాడుటయేగాక అతనిని బంధించి యుంచెదమనియు అతనికి కొంత భరణము నివ్వవలసినదనియు ప్రతాపునితోనే బేరముబెట్టిరి. భారతదేశమున బ్రిటీషువారు రాజ్యాక్రమణ కొరకు చేసిన ధర్మయుద్ధములలో నిదియే మొదటిది.
తంజావూరు కర్నాటక నవాబు క్రింది సామంతరాజ్యము. ఈ కర్నాటక నవాబుపై యధికారి దక్షిణహిందూస్థాన సుబేదారుడు. అనగా మొగలాయి చక్రవర్తియొక్క దక్షిణరాష్ట్రపాలకుడగు హైదరాబాదు నవాబు. ఆనాడు ఆంగ్లేయులకు ఫ్రెంచివారికిని వ్యాపారములో పోటీగానుండెను.