8
భారతదేశమున
చెప్పనక్కరలేదు. లాటీప్రయోగములు, తుపాకీకాల్పులు, స్త్రీల నవమానించుట, శాంతిసైనికులను స్మృతి తప్పువరకు కొట్టుట, అనేక అత్యాచారములు చేయుట, జైళ్ళలో ఖైదీలను లాటీలతో కొట్టుట, సత్యాగ్రహమహోద్యమమున పరిపాటియైనది. నాటి పోలీసు రాజ్యమును గూర్చిన కథలందరికిని దెలియును. పోలీసు సూపరెంటెండెంటు స్వయముగా కూడ దగ్గరనుండి డాక్టరు సుబ్రహ్మణ్యంగారిని, వెన్నేటి సత్యనారాయణగారిని, అనేక మర్యాదస్థులను ఎముకలు విరుగకొట్టించిన సంగతి అనేక కేసులలో బయల్పడినది. ఒక ఆంగ్లేయ డాక్టరుగూడ ఇట్లు కొట్టబడెను. ఇతని పేరు పేట౯. ఒక ప్లీడరుగారిని వస్త్రవిహీనునిజేసి కొట్టినసంగతి గూడా పార్లమెంటులో చర్చింపబడినది. దొంగతనము జరిగినదని పిర్యాదుచేయగా "మీ గాంధితో చెప్పుకో" మని పోలీసువారు ఈసడించిరి ! ఈ పోలీసుశాఖకు మేజస్ట్రీటులకు అవినాభావసంబంధము కలదు. నాడు జిల్లా మేజస్ట్రీటుకన్న పోలీసుసూపరెంటెండెంటుకే ప్రభుత్వములో హెచ్చు పలుకుబడి యుండెను. పోలీసువారికి కావలసిన సహాయమెల్ల చేయవలసినదని మేజస్ట్రేటులకు తాఖీదులంపబడెను. బెజవాడలోనే ఒక కేసు విచారణ జరుగుచుండగా డిప్యూటి సూపరెంటెండెంటు న్యాయస్థాన వేదికపై సబుకలెక్టరుతో కలిసి కూర్చొనియుండుటను ఈ గ్రంథకర్తస్వయముగా చూచియున్నాడు. సబుకలెక్టరుప్రయివేటు రూములోనికిపోయి రాజకీయ నాయకుల కివ్వవలసిన తరగతినిగూర్చి పోలీసువారే నిర్ణయింపచేసి యుండుట సర్వసామాన్యముగా జరుగుచుండెను.