పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

23


చిల్లిగవ్వయైనను ఖర్చుకాలేదు. ఈ బ్రిటీషువారు నిజముగా భారతీయుల ధనముతోను భారతదేశ వర్తకముతోను దేశాక్రమణము జేసిరి. ఇంగ్లీషువా రీదేశమును తమఖడ్గబలమువలన జయించలేదు. కేవలము కుటిలోపాయమువలన జిత్తులవలన రాజ్యతంత్రప్రయోగము వలననే జయించిరి. నిజముగా బలప్రయోగముచే నీదేశము నాక్రమించుటకు వారు బహిరంగముగా ప్రయత్నించియుండినచో నీ దేశములో నాటికి బలవంతులై యుండిన రాజులుఏకమై వీరిని పారదోలియుందురు. ఆంగ్లేయులు చాలా తెలివితేటలతో తమరాజ్యతంత్రమును ప్రయోగించిరి. దేశములోని రాజులలోను నవాబులలోను వైరములు బుట్టించి యెవరిపక్షముననో చేరి తాము లాభమును పొందుచుండిరి. నిజముగా నాంగ్లేయులకు 1687 నాటికే సామ్రాజ్యకాంక్ష యుండెను. గాని పైకి తమకురాజ్యకాంక్ష లేదనియు కేవలము వ్యాపారలాభము నార్జించుటయే తమ యుద్దేశమనియు చెప్పుకొనుచుండిరి. దిగ్విజయముచేసి సామ్రాజ్యము స్థాపింతునని క్లైవు 1765 లో చెప్పినప్పుడు డైరెక్టర్లు ఖర్చు భరింపలేమనిరి. ఆనాటి రాజులు నవాబులు ఆంగ్లేయులనుజూచి మోసపోయిరి, ఒకరికన్న నింకొకరు వీరి సహాయమును పొందుచు వీరికి హెచ్చు సౌకర్యముల నివ్వసాగిరి. వీరందరును పోరాడుకొని దుర్బలులై పోయినపిదప నాంగ్లేయులు నిజస్వరూపమును జూపించిరి. ఇట్లు భారత దేశాక్రమణమును ఆంగ్లేయవర్తకులు తమకు వీలైనట్లుగను దమ్మిడీ ఖర్చు లేకుండగను జేసిరి.

భారత దేశమందు కంపెనీ వారి అధికారము పలుకుబడి