20
భారత దేశమున
నైన బలవంతులుగనుండిరేని వారే స్వతంత్ర ప్రభువులగు చుండిరి. పేరునకుమాత్రము మొగలాయి చక్రవర్తికి కప్పముగట్టు సామంతరాజులుగ నుండిరి. చక్రవర్తి కెప్పుడై న నజరానాలంపిన కద్దు, లేనిచో లేదు. వారికి కావలసినచో ఏదైన గొప్ప బిరుదమును చక్రవర్తివలన నందుచుండిరి. వీరు వంశపరంపరముగ నేలుచుండిరే గాని చక్రవర్తి యిష్టము వచ్చినప్పుడు వీరిని తొలగించుటకు వీలు లేకుండెను. ఇట్లే బంగాళమును, కర్నాటకము నేలిన మహమ్మదీయ నవాబుల వంశీయులును, హైదరాబాదు నేలు నైజామువంశము నుద్భవించినవి.
ఎన్నటికైన నీకల్లోల మంతమగునా? భరత ఖండమున శాంతియుత ప్రభుత్వము మరల నెలకొల్పబడునా? యను ప్రశ్నల కేజ్యోతిష్కుడును ప్రత్యుత్తర మీయజాలకుండెను. హిందూదేశమును మహారాష్ట్రులేలుదురో మహమ్మదీయు లేలుదురో, లేక "మొగలుచక్రవర్తులవంశము యొక్క మూలపురుషునివంటి వీరు డెవడైన నేకొండలోయలనుండియైన వచ్చునో యనుకొనిరే గాని, భరత ఖండముసకు పది వేలమైళ్ళ దూరముననున్న ద్వీపమునుండి వర్తకము చేయుట కొరకు వచ్చిన వణిజ సంఘము వా రొకశతాబ్దము లోపుగనే హిమాచల ప్రాంతములనుండి కన్యాకుమారివరకుగల దేశమునెల్ల చల్లగ కాజేసి ఏకచ్ఛత పరిపాలనమును స్థాపింతురని ఎవ్వరును కలనైన తలపరైరి.