కాంగ్రెస్ అజ్ఞాతవాసము
415
బొంబాయిలో ఓడదిగగానే అచ్చట ఆయన కివ్వబడిన స్వాగతము ఏరాజప్రతినిధికిని, ఏచక్రవర్తికిని ఈ యబడి యుండలేదు.
సంయుక్తరాష్ట్ర పశ్చిమోత్తర - పరగణాలలోని రాజకీయ విషయములనుగూర్చి మహాత్ముడు వైస్రాయితో మాటలాడదలచెను గాని దానినిగూర్చి మాటలాడుటకు విల్లింగ్డన్ ఈయనకు దర్శనమీయ నిరాకరించెను. ఇంతకన్న కాంగ్రెసు గౌరవమున కప్రతిష్ట వేరొకటిలేదు. ఇక శాంతిసమరము చేయక తప్పనిసరి యయ్యెను. కాంగ్రెసుమహాసభ సత్యాగ్రహ మారంభించెను. దీని నారువారములలోనే యణచి వేసెదనని విల్లింగ్డను పలికెను. జనేవరు 1932 లోనే ముఖ్యమైన కాంగ్రెసునాయకుల నందరను చెర కంపెను. ఇక కాంగ్రెసువా రెట్టి ఆందోళనము గావింపకుండుటకు లాటీఛార్జీలు, తుపాకి కాల్పులు ప్రారంభింపబడెను. పోలీసువారు కావించిన క్రూరకృత్యములకు, అత్యాచారములకు, న్యాయాధిపతులును, ఉద్యోగులును చేసిన అన్యాయములకును లెక్కలేదు. ఈ శాంతిసమరములో ఒక లక్షమంది చెరసాల కేగిరి. లాటీదెబ్బలుతిని కళ్లు, కాళ్లు పోగొట్టు కొన్నవారు, మరణించినవారు, సర్వస్వము పోగొట్టుకొన్నవారు, అసంఖ్యాకులుగా నుండిరి. కాంగ్రెసు సంస్థ లెల్ల అశాస్త్రీయములుగా చేయబడెను. దేశమునందు కాంగ్రెసువాది అనువాడు మసలుటకుకూడ వీలులేనట్లు నిర్బంధములు నిషేధములు చేయుటయేగాక కాంగ్రెసువారికి సహాయముచేయుట వారిపట్ల సానుభూతిచూపుటగూడ శిక్షార్హమగు నేరముగా చేయబడెను.