Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

ప్రధానమంత్రి జనేవరు 19 వ తేదిన ప్రకటించిన ప్రకారము “ఇకముందు జరుగు రాజ్యాంగసంస్కరణప్రణాళిక చర్చలందు కాంగ్రెసుపక్షమువారి ప్రతినిధులు పాల్గొనునట్లు చేయుటకు తగుచర్య తీసికొనబడు"నని ప్రభుత్వమువారును ప్రకటించిరి. తరువాత రెండవ రౌండుటేబిలుసభ జరిగినది. దానిలో కాంగ్రెసు తరఫున ఏకైకప్రతినిధిగా వెళ్ళిన గాంధిమహాత్ముడు భారతీయుల కోరికలను స్పష్టముగా వెల్లడించినాడు.

ఏడవ ప్రకరణము

కాంగ్రెసు - అజ్ఞాతవాసము

రెండవ రౌండుటేబిలుసభ లండనులో జరుగుచుండగానే ఇంగ్లాండుదేశమునందలి రాజకీయార్థికపరిస్థితులందు కొన్నిచిక్కులు కలిగెను. ఇంగ్లాండుదేశమున బంగారపుకరవు వచ్చెను. వర్తకము పడిపోయెను. వారి బంగారునాణెమగు నవరసువిలువ తగ్గిపోయెను. ఆ దేశపు ప్రజలకు చాలభయము కలిగెను. అంతట నీ ఆర్థికవిపత్తునుండి బయలుపడు టెట్లాయని అందరు నాలోచింపసాగిరి. అట్టిస్థితిలో జరిగిన ఎన్నికలలో లేబరుపక్షము ఓడిపోయి నిరంకుశసామ్రాజ్య వాదులును భారతదేశ స్వాతంత్ర్యవిరోధులు నగు 'కన్సర్వేటివ్' పక్షమువారు పార్లమెంటులోనికి బహుసంఖ్యాకులుగా వచ్చిరి. అంతట కేవలము ఇంగ్లాండు క్షేమలాభముకొరకు పాటుపడుట కే కంకణము గట్టుకొన్న నేషనల్ గవర్నమెంటు రాజ్యమునకు వచ్చెను.