గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి
411
V
గాంధీ - ఇర్విన్ సంధి
గాంధీమహాత్మునకును ఇర్వినుప్రభువునకును జరిగిన సంభాషణలవలన 1931 మార్చి 5 వ తేదీన ఒక సత్యాగ్రహ విరామసంధి జరిగెను. కాంగ్రెసు సత్యాగ్రహము విరమించునట్లును బ్రిటీషు సామ్రాజ్యప్రభుత్వమువారి యనుమతితో కేంద్ర రాష్ట్రీయప్రభుత్వములు కొన్ని రాజీచర్యలు జరిగించునట్లును నిశ్చయింపబడెను. ఐరిష్‌ఫ్రీస్టేటువలెనే ఇచ్చటి ప్రభుత్వమునకును ప్రజలకును మధ్య నిట్టి సంధిజరుగుట ఒకగొప్ప సంగతిగనుండెను. ఆ సంధిపత్రముననే రాజ్యాంగ విషయమును గూర్చి ఇట్లు వివరింపబడెను: “రాజ్యాంగ సమస్యల విషయమున రౌండుటేబిలుసభలో ముందుజరుగబోవు చర్యలయొక్క ఉద్దేశము ఇదివరకు చర్చింపబడిన రాజ్యాంగప్రణాళికను మరింత చక్కగా యోజించుటకే యైయుండును. ఆప్రణాళికలో ఫెడరలు విధాన మొక ప్రధానభాగము. అట్లే భారతీయ ప్రజాప్రతినిధుల బాధ్యతయు నొక ప్రధానాంశము. మఱియు దేశరక్షణ (సైన్యము), విదేశవ్యవహారములు, అల్పసంఖ్యాక జనుల హక్కులు, భరతఖండముయొక్క ఆర్ధిక - పరపతియొక్క బాధ్యతలను సరిగా నిర్వర్తించుట, మున్నగు విషయములందు భరతఖండముయొక్క క్షేమలాభములకొరకు వలసిన మినహాయింపులును రక్షణలునుగూడ ప్రధానాంశములే. ఈ స్టేట్ మెంటు సామ్రాజ్యప్రభుత్వమువారి యనుమతితో చేయబడుచున్నది.”