పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి

403


ఇందొక్క భారతీయునైనను నియమింపకపోవుటవలననే వారి యుద్దేశములపట్ల భారతజాతీయవాదుల కనుమానము కలిగెను.

కేవలము సోపానములుగ, కొంచెముకొంచెముగ సంస్కరణములు చేసిన లాభములేదనియు సరియైన స్వపరిపాలనమును ప్రసాదించు రాజ్యాంగప్రణాళిక తయారుచేయబడవలెననియు జాతీయవాదులు కోరుచుండిరి. భారతదేశ రాజకీయపక్షము లన్నిటిని చేరదీసి అందరకును సమ్మతమగు నొక స్వరాజ్య రాజ్యాంగమును తయారుచేయుటకు 1927 లోనే కాంగ్రెసు నిశ్చయించెను. ఆ ప్రకారము సమావేశమైన సర్వపక్ష సభవారు నియమించిన నెహ్రూ కమిటీవారు "డొమినియ౯ స్టేటసు" వంటి అధినివేశ స్వరాజ్య ప్రణాళిక నొకదానిని తయారుచేసియుండిరి. అఖిలభారత దేశప్రజలయొక్క కోరిక ననుసరించి ఒక సంవత్సరములో డొమినియ౯ స్టేటసు నొసగనిచో సామ్రాజ్యముతో సంబంధము లేకుండ సంపూర్ణస్వాతంత్ర్యమునే స్థాపించుటకు ప్రయత్నింతుమని 1928లో కాంగ్రెసు మహాసభ తీర్మానించెను.

సైమను కమిటీలో భారతీయులులేనందున దానిని భారతీయులు బహిష్కరింపవలెనని 1927 లోనే కాంగ్రెసు వారు తీర్మానించియుండిరి. అంతట 1928 ఫిబ్రవరిలో 'సైమను కమిషను' వారు ఓడదిగినది మొదలు దేశములో నెచ్చటికి పోయినను తిరస్కారమే ఎచ్చటికిపోయినను నల్లజెండాల సన్మానమే జరుగసాగెను. వారు వెళ్లినచోటులందు హరతాళములు జరుగగా నిషేధములు, లాటీచార్జీలు ప్రయోగింపబడసాగెను.