Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

398

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


రాజ్యాంగచట్టమును సవరించవలెనను రాజకీయాభిప్రాయము దేశములో వర్ధిల్లెను. అంతట కేంద్ర శాసనసభలో దానిని గూర్చిన తీర్మానము ప్రవేశపెట్టబడెను. అప్పుడు శాసనసభలోని కాంగ్రెను స్వరాజ్యపార్టీవారు భారతదేశమునకు ఒకచిత్తు రాజ్యాంగపుబిల్లును తయారుచేయుట కొక రౌండుటేబిలు కాన్ఫరెన్సును సమావేశపరుపవలెనను సవరణను ప్రతిపాదించి గెల్చిరి. అంతట ప్రభుత్వమువారు ఏదోయొకటి చేయవలసివచ్చి రాజ్యాంగచట్టములో ఏవైన మార్పులుచేయుట అవసరమా యని విచారించుటకు మడ్డిమన్ గారి అధ్యక్షతక్రింద ఒక కమిటీని నియమించగా 1925 లో నీకమిటీవారు నివేదికను ప్రకటించిరి. 1919 సంవత్సరపు రాజ్యాంగచట్టములోని కొన్ని నిబంధనలను గూర్చిన సవరణలుచేయుట అవసరమని వారు సూచించిరి. ఈ కమిటీలో మెజారిటీవారు పెద్ద సంస్కరణము లెవ్వియు చేయవలెనని సలహా నివ్వ లేదు. బాధ్యతాయుతపరిపాలనములో ఇంకను హెచ్చు అధికారము లివ్వవలసినదని గూడ సలహా నివ్వలేదు. రాష్ట్రములందు అడవులు రాష్ట్రీయ గవర్నమెంటు రిపోర్టులు, ముద్రాక్షరశాలలు మంత్రుల వశము చేయవలసినదని మాత్రము సలహానిచ్చిరి. ఇంకను కొన్ని స్వల్పపు మార్పులు సూచించిరి. మైనారిటీలో నున్న జిన్నాగారు ఒక్క పోలీసు శాంతి భద్రతలు తప్ప తక్కిన అన్ని ప్రభుత్వాధికారములును మంత్రులవశము చేయబడవలెననిరి. శివస్వామిఅయ్యర్ , సప్రూ మొదలగు మితవాద ప్రముఖులు గూడ ప్రభుత్వపక్షమున చేరక మైనారిటీవారి రిపోర్టులోనే