Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

భారత దేశమున


ప్రజలకు గ్రామస్థులకు నుండిన పలుకుబడి యిప్పుడు పోయి ఉద్యోగులయధికారములు హెచ్చుచేయబడి అధికారుల జులుము మితిమీరినది. సర్వాధికారియగు కలెక్టరు ప్రజాపాలకుడైనాడు. (చూడు : లోకమాన్యతిలకు ఉపన్యాసములు)

II

ఔరంగజేబుచక్రవర్తి పరిపాలనముననే మొగలు సామ్రాజ్యనాశకారణము లేర్పడెను. ఈభూపాలుడు క్రీ.శ. 1707న చనిపోవగనే ఈ కారణములు మరింత వృద్ధిజెందెను. ఔరంగజేబు చనిపోయినపిదప నలుబది సంవత్సరములలోనే మొగలు సామ్రాజ్య మంతరించెనని చెప్పవచ్చును. ఔరంగజేబుని యనంతరము మొగలాయి సింహాసనము నెక్కిన రాజులెల్ల అంతఃపురమునందు సురాపానలోలురై భంగుమత్తునను, వార వనితలసల్లాపములందును, విదూషకుల సంభాషణలతోను ప్రొద్దుపుచ్చుచుండిరి. హిందూదేశమునకు పశ్చిమోత్తరమున నున్న కనుమలనుండి క్రూరజాతులవారు వచ్చిపడి భారతీయుల భాగ్యమును కొల్లగొనుచుండిరి. పెర్షియా దేశపు వీరు డొకడు భరతఖండము జొచ్చి, ఢిల్లీ ప్రవేశించి, భరతఖండమునందు కాలిడుటకు తావిమ్మని మనచక్రవర్తుల నడుగవచ్చిన రాయబారుల కచ్చెరువు గొలిపిన మయూరసింహాసనమును బట్టుకొనిపోయెను. పెర్షియావారు మొదలిడిన నాశనమును ఆఫ్‌గనులు పూర్తిచేయసాగిరి. మొగలాయి సార్వభౌమత్వమును రాజపుత్రులు నిరాకరించిరి. సిక్కులు సింధునదీ ప్రాంతముల నేలసాగిరి.