పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


తిరుగరాదు. తిరిగినచో దొరలకు కోపమువచ్చి శాంతికిభంగము చేయుదురట! (ఈసంగతిని కర్నల్ జాన్సను తనసాక్ష్యములో చెప్పినాడు.) గుజ్రాన్ వాలాలో పై నుండి ప్రజలపైన బాంబులు కురిపించిరి. చదువుకొనుపిల్లల బోర్డింగుహౌసుపైన బాంబులువేసిరి. భారతదేశప్రభుత్వమువారు డయ్యరుసేనాని పొరబాటు చేసెనని చెప్పి అతనిని మన్నించి యతని పింఛనుకు లోపము లేకుండజేసిరి. ఆంగ్లేయు లతనికి బహుమతులిచ్చి గౌరవించిరి.

ఆకాలములో పంజాబురాష్ట్రమునకు గవర్నరుగానుండిన సర్ మైకేల్ ఒడ్వయరు చేసిన ఘోరముల నెల్ల లాలా లజపత్ రాయిగారు తమకాంగ్రెసు అధ్యక్షోపన్యాసములో పూస గ్రుచ్చినట్లు వర్ణించి అతడుచేసిన నేరములకు విచారించి శిక్షింపవలెననికోరిరి. గాని అట్లు జరుగలేదు సరికదా ఈతని నాంగ్లేయులు బహూకరించి గౌరవించిరి. ఇత డింగ్లాండునకు వెళ్ళిన పిదప గూడా భారతదేశ క్షేమమునకు వ్యతిరేకముగా పాటుపడజొచ్చెను. ఆనాడు ఒడ్వయరుచేసిన అన్యాయములను లజపత్ రాయిగా రిట్లు వర్ణించియున్నారు:

1. “హిందువులను మహమ్మదీయులను విడదీసి పాలించుట కిత డీ రెండు తరగతులకును సిక్కులకునుగూడ మిత్రభేదములు కల్పించినాడు.

2. శౌర్యముగలవారని, విద్యావంతులని, గ్రామస్థులని, పట్టణవాసులని, ప్రజలలో అనేక భేదములు కల్పించి పాలించినాడు.