పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

371


కచ్చటి రహస్య రాజకీయ సంఘములవారు గావించు 'టెర్రరిజం'. భయంకర విప్లవమార్గములను వీరు ఉదాహరణముగా గొని ప్రభుత్వోద్యోగులను బాంబులువేసి వధించుటకు, తుపాకులతో కాల్చుటకు, రహస్యప్రయత్నములు చేయుట దానికి వలసిన సరంజాము సమకూర్చుకొనుట, బందిపోటుదోపిడిచేసి ధనము సేకరించుట మున్నగు దారుణపద్ధతు లవలంబింపసాగిరి. ఈ 'టెర్రరిజం' లేక దారుణవాదము 1907 మొదలు 1908 వరకు చాలతీవ్రముగా విజృంభించెను. యువకులు బాంబులు ప్రయోగించియు, తుపాకులతో కాల్చియు ఇతరవిధములగు దారుణకృత్యములు జరుపసాగిరి. జిల్లా మేస్ట్రేటుపైన తుపాకీ పేల్చిరి. లెఫ్టినెంటు గవర్నరును చంపప్రయత్నించిరి. కింగ్సు ఫోర్డును బాంబువేసి చంపుటకు ప్రయత్నింపగా నది ముజఫర్ పూరులోని ఇర్వురు ఆంగ్లేయ స్త్రీలకు తగిలి వారు మరణించిరి.

ప్రభుత్వమువారును దారుణవాదమునకు ప్రతిక్రియగా తీవ్రమైన అత్యాచారములు చేయుచు, సోదాలు, నిషేధాజ్ఞలు, నిర్బంధములు క్రూరకృత్యములు చేయసాగిరి. ఆకాలమున శ్రీ అరవిందఘోషు వంగదేశములోను, లోకమాన్యతిలకు మహారాష్ట్రములోను పత్రికలను నడుపుచు ప్రజలలో చాలా పలుకుబడిని కలిగియుండిరి. తిలకుమహాశయుని కేసరి పత్రిక ఆనాడు 20,000 ప్రతు లమ్ముడు పోవుచుండెను. ఆనాటి జాతీయ పత్రికలలో ప్రధానములైన ఈ కేసరి మొదలుగా గల పత్రికలు దారుణవాదుల చర్యలను ఖండించుచుండెను. గాని ఆయువకుల దేశభక్తిని మెచ్చుకొని కౄరములగు