పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

369


ప్రభుత్వక్రోధాగ్నికి ఆహుతియై చెరయందుబడి ఆరోగ్యమును చెడగొట్టుకొని బయటకు వచ్చినపిదప జీవనాధారముకూడ లేక అల్లాడుటకు సంసిద్ధుడై తన జీవితమునెల్ల ధారవోసిన ప్రథమ ఆంధ్రసత్యాగ్రహియగు నీ సర్వోత్తమరావుగారి పేరు మనము కృతజ్ఞతతో స్మరింపవలెను. ఆదేశసేవా ఫలితముగానే ఇత డీనాటికికూడ దారిద్ర్యదుఃఖము ననుభవించు చున్నాడు. ఇట్టివా రెందరో అజ్ఞాతవీరులు కలరు. వీరి త్యాగఫలమే కాంగ్రెసుమహాసభకు మహత్తరమైన శక్తిని కలిగించి కాంగ్రెసు ప్రభుత్వోదయమునకు దారిచూపినది.

నాడు ఆంధ్రదేశమున ప్రజ్వలించిన దేశాభిమానము కేవలము మాటలతో చల్లారలేదు. నేటికాంగ్రెసునిర్మాణ కార్యక్రమమువలెనే నాడును దేశాభివృద్ధికి తోడ్పడు పెక్కుపనులు జరిగెను. నాటిజాతీయభావము. దేశాభిమానము ముట్నూరి కృష్ణారావుగారిచేత కృష్ణాపత్రికను జాతీయాభ్యుదయము కొరకు నడిపించినది. కోపల్లె హనుమంతరావు గారిచేత ప్లీడరు పట్టాను బందరుకాలవలో చింపి పారవేయించి ఆంధ్రజాతీయ కళాశాలను స్థాపింపజేసి యావజ్జీవదేశ సేవకునిగ జేసినది. డాక్టర్ పట్టాభిగారిని ఉద్యోగాభిలాషను విడనాడజేసి కాంగ్రెసునాయకునిగ జేసివైచినది. నాటి విజ్ఞాన వికాసములే తిరుపతి వెంకటేశ్వరులవంటి సాహిత్య సరస్వతులను, పోలవరం రాజాగారివంటి రాజ్యనీతిజ్ఞులను, ఆంధ్రదేశ బంకించంద్ర చటర్జీ యనదగిన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిని, కోడి రామమూర్తి నాయ్డుగారివంటి దేశభక్తుడగు ఆంధ్రభీముని,