పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

367


త్తమరావుగారు, కీర్తిశేషులైన గజవల్లి రామచంద్రరావుగారు మొదలగు నిరువదిమంది యట్లు చేసినందుకు ఆకళాశాల ప్రిన్సిపాలు మార్కు హంటరు దొరగారు వారిని కళాశాలనుండి వెళ్లగొట్టి రెండేండ్లదాకా ఎచ్చటను చేర్చుకొనరాదని ఆంక్ష వేసిరి. వీరికి ప్రభుత్యద్యోగముల నీయరాదని గెజటులో ప్రకటింప బడెను. తరువాత వీ రిరువురును యమ్. ఏ. పరీక్షయం దుతీర్ణులైరి. హరిసర్వోత్తమరావుగారు 1907 లో బెజవాడలో స్వరాజ్యపత్రిక అను జాతీయపత్రికను నిర్వహించుచు వందేమాతరోద్యమమునకు తోడ్పడిరి. ఆరోజులలో పోలీసు సోదాలు, నిఘాలు, దౌర్జన్యములు ప్రబలెను. సర్వోత్తమరావు గారిని, ముద్రాపకులగు బోడి నారాయణరావుగారిని రాజద్రోహముక్రింద 1908 లో పట్టుకొనిరి. నాటికింకను గాంధిమహాత్ముని సత్యాగ్రహసమరపద్ధతులుగాని ఒకరివెంట నొకరు ఉత్సాహముతో ఇష్టపడి చెరసాలకేగి ప్రభుత్వముతో సాత్వికనిరోధము చేయుట అనునదిగాని ప్రజ లెరుగరు. పోలీసువాని ఎర్రతలపాగను చెరసాలయొక్క ఇనుపకమ్ములను చూచినంతనే జనసామాన్యముయొక్క ప్రాణములు పైకి పోవుచుండెను. ప్రజల నింకను భయపెట్టి దేశాభిమానము నణచి వేయవలెనని రాజద్రోహమున కరెస్టు చేసిన వారికి సంకెళ్ళువేసి వీధులవెంట ద్రిప్పుటయు చెరసాలలందు తలలు గొరిగించి మల్లచిప్పలయందు పురుగుల అంబలిని పోయించి బాధించుటయు నాటికిని నేటికిని ఒకేతీరుగానున్నది. శాసనసభ్యుడును బి.యల్. పరీక్ష నిచ్చినవాడును శ్రీమంతుడును