Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

362

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఈయన ఎన్నడును పదవుల నాశింపలేదు. ప్రభుత్వ మీయనకు బిరుదుల నొసగదలపగా నీయన స్వీకరింపలేదు. ఇట్టి నిష్కళంకమైన దేశభక్తుడు, త్యాగధనుడు, నేటికిని, మితవాదులలో నింకొకడులేడు. మితవాదియని పేరేగానే నేటి మితవాదులవలె ప్రభుత్వము నెన్నడు నాశ్రయించినవాడు కాడు. ఇతడు నిజముగా గాఢమైన దేశాభిమానముగల రాజకీయ నాయకుడేగాని ప్రభుత్వముతో విరోధము పెట్టుకొనుటకు ఇష్టపడడు. మఱియు రాజకీయములందు తీవ్రపద్దతులను సహింపకుండెను. ఆరోజులలో కాంగ్రెసులో కలిగిన చీలికల కిదియే కారణముగాని వేరుకాదు. ఏదియెట్లున్నను ఈ మహానుభావుని గౌరవించు విషయములో మాత్రము నాటికినేటికి మితవాదులు అతివాదులు నను భేధభావము నెవ్వరును కనుబరుపలేదు. గాంధీమహాత్ముడుగూడ రాజకీయములందు గోఖలేగారే తనకు గురువని చెప్పుచుండుట వలననే ఈ మహామహుని గొప్పదనము వెల్లడియగుచున్నది. సాత్వికనిరోధ పద్ధతులయందు గాంధీమహాత్ముడెంత ప్రజ్ఞావంతుడో, పార్లమెంటరీశాసనసభ కార్యక్రమములయందు గోఖలే గారంత ప్రతిభాశాలి. మహాత్ముడు సత్యాగ్రహమునకు మూలపురుషుడైనట్లే గోఖలేగారు. భారతదేశ పార్లమెంటరీ రాజ్యతంత్ర పద్ధతులకు మూలపురుషుడు. ఎట్టి యధికారములులేని బొమ్మకొలువులందుగూడ తన అనర్గళ వాగ్ధోరణిచే తీవ్రవిమర్శనలచే గోఖలేగా రానాడు కొన్ని రాజ్యాంగ మర్యాదలు స్థాపించినారు.