Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

361


ఇంకొక రనుట దేశభక్తి సూచకమగు జోహారుగనుండెను. దేశములోనివిద్యార్థులందు గొప్ప సంచలనము కలిగెను. వందేమాతరం చిహ్నములతో కాలేజీలకు, పాఠశాలలకు బోవుట, వందేమాతరమని యఱచుట, అందులకు అధికారులు కోపించి విద్యార్థులను వెళ్లగొట్టుటయు గూడజరిగినది. ఆసియాఖండవాసులగు జపానీయులు ఐరోపావాసులగు రష్యావారి నోడించగా జపాను పారతంత్ర్యమున బడనందువలననే ఆ దేశమిట్లు అభివృద్ధి జెందిన దను తలంపు మనవారికి కలిగెను.

1906 లోజరిగిన కాంగ్రెసు మహాసభలో దాదాభాయి నౌరోజీ యధ్యక్షత వహించెను. భారతదేశమునకు “స్వరాజ్యము" కావలెనను తీర్మానము చేయబడెను. దేశప్రజలు - పరవశులై దేశభక్తిపూరితులై ప్రవర్తింపసాగిరి. నాటినుండి “స్వరాజ్య" మను పదము వాడుకలోనికి వచ్చినది.

III

గోఖలేగారు 1907-08 లో నింపీరియల్ శాసన సభలో ప్రభుత్వమువారి ఆదాయ వ్యయవిధానములను నిర్బంధకరములైన రాజకీయ చర్యలను అతి తీవ్రముగా విమర్శించి సంచలనము కలిగించుచుండగా నొకవంక ఈయన విమర్శనలను నింకొకవంక దేశములోని తీవ్రరాజకీయాందోళనమును జూచి మింటోప్రభువు, గోఖలేగారి విమర్శనలను అపనయించుట కేవో కొన్ని సంస్కరణములను జేయుట యవసరమని తోచి సీమకు వ్రాసెను. గోఖలేగారికి అధికారులన్నను, ప్రభుత్వమన్నను భయముగాని మోమోటమిగాని లేదు.