Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చల్లార్చు చున్నామని తెల్పుచుండిరి. ఈ అత్యాచారముల కెల్ల చేయబడిన ఖర్చుతో గలిసి విప్లవము నణచుటకు నలుబదికోట్లరూపాయలు వ్యయమైనట్లు అంచనావేసి దానిని భారతీయ ప్రజల నెత్తిపైన బడవేసిరి. ఇంతఘోరమైన విప్లవమువచ్చి ఇంత రక్తపాతమైనపిదప శాంతియేర్పడునప్పటికి ఆంగ్లేయుల కోపాగ్ని చల్లారునప్పటికి చాల కాలము పట్టినది. (చూడు : కే. మల్లెసనుల ఇండియ౯ మ్యూటినీ)

III

కంపెనీవారి దుష్పరిపాలనము మాన్పుటకు వివిధరాష్ట్రములో శాంతియుతముగా లక్ష్మీనర్సుమున్నగువారు ఎంతకష్టపడిపనిచేసినను ఇంగ్లాండు వారికి చీమయైన కుట్టినట్లు లేదు. భారతదేశమునుండి వారికి వచ్చిన విన్నపములు, మహజరులు, బుట్టదాఖలు చేసియుండిరి. అంతట నా కార్యమును సాధించుటకే హింసా పద్ధతులతో దారుణవిప్లవము జరుగగా తత్క్షణమే యీ లక్ష్మీనర్సు మున్నగు అహింసావాదులు ఏమి కోరుచుండిరి? దేశములో నింత యశాంతి ఎందుకు ప్రబలెను? ఇంత దారుణ విప్లవము ఎందుకు జరుగవలసి వచ్చెను? అను ఆలోచనలు కలిగెను. చాలకాలమునుండి కంపెనీవారి దుష్పరిపాలసమును గూర్చి చేయబడుచున్న ఫిర్యాదులలో కొంతయైన నిజ ముండవలెనను ఊహ, ఇంగ్లాండు దేశీయులకును పార్లమెంటు వారికిని కలిగెను. వా రప్పుడు పూర్వము లక్ష్మీనర్సు మున్నగువారు పంపిన అర్జీలు మహజర్లు బయటకుదీసి భారతదేశ వ్యవహారములెల్ల పరిశీలించి భారతీయుల బాధలు నిజమేననియు వారు