324
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
లోను సాక్షాత్తుగా రక్తపాతము జరుగువరకు నీ భారతదేశ సమస్యయనునది తమ తాబేదారుల దుష్పరిపాలనమువలన కలిగిన విప్లవమనిగాని ఈ దేశమనునది కోట్లకొలది జనులుగల విశాలరాజ్యమునకును అందలి ప్రజలకష్ట సుఖములకును సంబంధించిన గొప్పసమస్యయనిగాని పార్లమెంటులో నే యాంగ్లేయ సభ్యుడును తలంపడయ్యెను. ఇంతటి యుపేక్షాభావమే బ్రిటిషు పరిపాలనలోని అన్యాయములకు మూలకారణముగనుండెను.
II
ఈ విప్లవవ్యూహమునకెంత జాగ్రత్తగా ఆలోచనలు జరిగెనో, ఎంతరహస్యముగాకుట్రలుజరిగెనో తెలిసికొనుటసాధ్యముకాదు. కొన్నినెలలనుండి యీ రాబోవు తుపాను లక్షణములు కనబడుచునేయుండెను. ఉత్తరహిందూస్థానములోని దండుప్రదేశములో సంకేతపుమంటలు వేయబడుచుండెను, దీనిభావము నాంగ్లేయు లెరుగరు. ఇంగ్లీషు ప్రభుత్వము 100 సంవత్సరములలో పోవునని అనేకులు భవిష్యత్తును చెప్పుచుండిరి. మహమ్మదీయ సామ్రాజ్యము మరల స్థాపింపబడినదని ఢిల్లీ జుమ్మామసీదు గోడలపైన వ్రాయబడి ప్రకటనచేయబడెను. గ్రామములవెంట చపాతీలను ఉప్పు అందించినట్లు అందించిరి. ఇది ఆంగ్లేయులు గమనింపలేదు. ఒకడు పండ్రెండు చపాతీలుచేసి దానిలో రెంటిని ఉంచుకొని తక్కినవానిని ఇంకొకనికి పంపుచుండును. ఆ రెండవవాడు మఱల 12 చేసి అట్లే యితరులకు పంపును. దీని అంతరార్థమును పలువురు పలువిధములుగా తలంచుచుండిరి.