314
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
అర్పించి దరిద్రుడై కీర్తి శేషుడైన ఈ లక్ష్మీనర్సుగారి నేమని పొగడవలెను? కేవలము ధనార్జనములోనే కాలము గడుపుచు లుబ్ధుడుగను అధికారులజూచిన భయపడిపోవు పిరికివాడుగను నుండవలసిన సాహుకారు ఉదారుడై , త్యాగియై ధైర్యశాలియై దేశభక్తుడైనాడు. స్వమతరక్షణకొర కధికారులతో పోరాడి ప్రజలహక్కులను సంరక్షించుటకొరకు రాజకీయోద్యమము నడిపి కృతకృత్యుడైనాడు. ఇట్టి మార్పు పరమేశ్వరు కృపవలనగాక మరియెట్లు కలుగును? వేదములు ప్రమాణములనియు ఉపనిషన్మతము సత్యమనియు జన్మపరంపర నిజమనియు దుష్టశిక్షణము శిష్టరక్షణము చేయుటకు భగవంతుడే యవతారముగా వచ్చునను మాట నిశ్చయమనియు నమ్ము ఈ భారతీయ ప్రజలు లక్ష్మీనర్సుగారు తమ్ము రక్షించుటకొరకు భగవంతుడంపిన దేవదూతయని నమ్ముటకును, నేటి గాంధీమహాత్ముని పూర్వావతారమని నమ్ముటకును అభ్యంతరమేమికలదు? లక్ష్మీనర్సుగారి వలెనే ప్రభుత్వోద్యోగములకు పదవులకు ప్రాకులాడక, బిరుదుల నాసింపక, స్వార్థము దలపక కేవలము పరమార్థచింతతో ధర్మముకొరకు దేశముకొరకు పాటుపడుచు అందుల కష్టములకోర్చి నష్టములను భరించి తమ సర్వస్వమును అర్పించి తుదకు ప్రాణములనుసహితము ధారవోసి దేశోద్ధరణ మహాయజ్ఞమున పూర్ణాహుతిని సమర్పించిన మహానుభావు లెందరో మనదేశములో వివిధరాష్ట్రములందు గలరు. గతించిన వారిని కీర్తిశేషులని మనవా రనుచుండుటయే గాని ఈ శేషించినకీర్తిగాని తుదకు వారి పేరులైనగాని