312
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
దేశముకొర కీ విధముగా పనిజేసి లక్ష్మీనర్సుగారు కృతకృత్యుడైనాఁడు. తన ధన మెల్ల సత్కార్యములను సాధించుటకే మహోద్యమములను నడపుట కే ప్రజాసేవకొరకే వ్యయపరచెను. ఈతని సంపదనెల్ల ఒక్క క్రెసెంటు పత్రికయె మ్రింగివేసినదనుటలో నతిశయోక్తిలేదు. శ్రీ టంగుటూరి ప్రకాశముపంతులుగారి 'స్వరాజ్య' పత్రికవలెనే నాటిక్రెసెంటు పత్రికయు ప్రభుత్వాగ్రహమునకు ఆహుతియగుదునను భయముకూడా విసర్జించి ప్రభుత్వచర్యలనుగూర్చి తీవ్రవిమర్శ చేయుటయె గాక ఆనాడు జరుగుచుండిన దురాగతములను నిర్భయముగ వెల్లడించు చుండెను. పత్రికా నిర్వహణము అతి కష్టసాధ్యము. అమిత ధనవ్యయకారణము. సామాన్యుడు చేయదగిన కార్యముకాదు. లక్షాధికారులు కూడ నిర్వహింపజాలరు. గొప్ప బారిష్టరుగా నుండి తాను సంపాదించిన ధనము సర్వస్వము స్వరాజ్యపత్రిక నిర్వహణమున పోగొట్టుకొని దేశముకొరకు దారిద్యము ననుభవించిన ప్రకాశముగారివలెనే వ్యాపారమున సంపాదించిన ధనము నెల్ల క్రెసెంటుపత్రిక నిర్వహణమున ఖర్చుపెట్టి లక్ష్మీనర్సుగారును దరిద్రులైరి. ఆయన తలపెట్టిన ప్రజాసేవ కార్యములెల్ల ధనవ్యయ కారణములయ్యెను. ఆయన చేసిన దేశసేవ ప్రయత్నములెల్ల ఆంగ్లేయ కంపెనీవారి ప్రభుత్వముతో విరోధము తెచ్చిపెట్టినవి. వారి కుట్రవలన ఇతని వ్యాపారమునకు నష్టము కలిగినది. కుమారుడప్రయోజకు డైనాడు. ధనమెల్ల గోల్పోయి లక్ష్మీనర్సుగారు 1868 లో దారిద్ర్యమున మరణించెను.