దేశోద్ధరణ ప్రయత్నములు
311
మైసూరుసంస్థానమునకు మహోపకారముగావించుట తటస్థించినది. మైసూరుయుద్ధము జరుగుచుండినప్పు డా దేశమును నైజాముతోకలిసి పంచుకొనుటకు బ్రిటిషువా రేర్పాటు చేసికొని యుండిరి. తరువాత ఆయేర్పాటుకు భిన్నముగా ఆ రాజ్యమును తామే యుంచుకొని అనుభవింపసాగిరి. మైసూరుయొక్క పూర్వపు రాజింకను మైసూరులో బ్రతికియుండెను. భారతదేశపు పూర్వపు రాజులలో నొక డిట్లు అన్యాయముగా పదభ్రష్టుడైయుండుట జూచి లక్ష్మీనర్సుగారికి జాలి కలిగెను. ఇతడు గాఢమైన దేశాభిమానము కలవాడైనందున ఈ రాజుకు మరల సంస్థానము నిప్పించవలెనను కోరిక గలిగినది. అంతట నావృద్దరాజును దత్తుచేసికొనుమని ప్రోత్సహించి ఆదత్తును ఖాయపరిచి ఆరాజ్యమును అతనికి మరల ప్రసాదించుటయో లేక పూర్వము జరిగిన ఏర్పాటుప్రకారము నైజామునకిచ్చు కొనుటయో చేయవలసిన సందర్భమును కలిగించినచో బ్రిటీషువారు దారికి వత్తురని గ్రహించి లక్ష్మీనర్సుగారు. రాజ్యతంత్రమును ప్రయోగించి నైజముమంత్రియగు సలారుజంగ్‌తో మాటలాడి బ్రిటీషువారితో రాయబారము నడిపించగా నైజాముకు రాజ్యభాగము నిచ్చుటకన్న మైసూరురాజుకు సంస్థానమిచ్చివేయుటయే గౌరవప్రదమని యెంచి బ్రిటీషువా రట్లు గావించిరి. ఇట్లు లక్ష్మీనర్సుగారు కేవలము పరమార్ధచింతతో దేశభక్తి పరుడై మైసూరు సంస్థానాధీశునకును ప్రజలకును మహోపకారము జేసినాడు. బ్రిటీషువారి వలన బాధలు పొందుచున్న చిన్న చిన్న రాజులకు రాణులకు నవాబులకుగూడ నీతడు చాల సాహాయ్యమును జేసెను.