Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


బొండలలోపెట్టి హింసించుచుండిరి. కొందరి నెండలో నిలువబెట్టి వారితలపైన రాతిబండల నెత్తియుంచి ఎదుట కర్రలు పుచ్చుకొని యుండిరి. కొందరిని తలక్రిందుగా కోదండములు తీయించిరి. ఇదిచూచి ఆదొరగారు నివ్వెరపోయిరి! ఇది యంతయు తాలూకాకచ్చేరీ యెదుటనే జరుగుచుండినను అచ్చటి కలెక్టరును తాశిల్దారునుకూడ తమపనిచేసికొనుచు నిది చూడనట్లూరకొనిరి! ఈదొరగారు తరువాత 1854 లో నీ సంగతులన్నియు పార్లిమెంటులో చెప్పగా నచ్చటివారు నమ్మలేదు. అంతట హింసాసాధనములను కొన్నింటిని తాను తెచ్చితిననియు కావలసినవారు వచ్చి చూచుకొన వచ్చుననియు అతి తీవ్రముగా నితడు సవాలు చేసెను. అంతట కొందరాతని పక్ష మవలంబింపగా ఎట్టకేలకు పన్నుల వసూళ్ళలో భారతదేశములో జరుగుచుండిన దారుణహింసలను గూర్చి విచారించుట కొక ఉపసంఘము నేర్చరచిరి. దీనికే ('మద్రాసు టార్చర్ కమిషన్ ') హింసల విచారణసంఘమని పేరు. ఈ ఉపసంఘమువారు సాక్ష్యముల గైకొనిరి. ఈ లోపుగా లక్ష్మీనర్సుగారు కూడా ఈ విషయములను గూర్చి అనేకులచేత సంతకములు చేయించి మహజరులను పంపి ఆ విచారణకు తోడ్పడిరి. ఆవిచారణవలన పన్ను లిచ్చుకోలేని రైతులను బాధించు దురాచారములు మాన్పబడెను.

ఈలోపుగానే కంపెనీవారికి భారతదేశ రాజ్యాధికారపు పట్టా మరల నొసగు సందర్భము తటస్థించగా కంపెనీ పరిపాలన కాలమునాటి భారత దేశస్థితిగతులనెల్ల తెలియబరచుచు లక్ష్మీ