పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

7


సంగీతసాహిత్యములు విరివిగానుండెను. ఇటువంటి మహాపట్టణమును ఇంతవర కెవ్వరు ప్రపంచములో నింకొకచోట కనివిని యుండలేదని అబ్దుల్‌రజాకు వర్ణించి యున్నాడు.

కృష్ణ దేవరాయలు తన సామ్రాజ్యమును తన సామంత మండలేశ్వరులక్రింద విభజించెను. వీరు తనకు రమారమి పది లక్షల సైన్య మంపునట్లు కట్టడిచేసెను. రైతులనుండి పంటలో ఆరవవంతు మాత్రమే మండలాధిపతులు పన్నుగా వసూలు చేసి దానిలో విజయనగర చక్రవర్తికి సగమువంతు చెల్లించునట్లు బందోబస్తుచేసెను. పంటలకు, సరకులకు సరసమయిన ధరలు నిర్ణ యించి పన్నులు రొక్కరూపముగా వసూలుచేయునట్లు ఆజ్ఞాపించెను. పోర్చుగీసు ఇంజనీయర్ల సహాయమున పెద్ద పెద్ద చెఱువులు త్రవ్వించియు, ఆనకట్టలను కట్టించియు వ్యవసాయ మభివృద్ధి గావించెను.

కృష్ణ దేవరాయల రాజ్యాదాయము 1300 లక్షల బంగారు వరహాలని 16వ శతాబ్దములోని ఒకవిదేశీయ బాటసారి అంచనా వేసినాడు. ఆసామ్రాజ్యము యొక్క సైనికబలములు చాలమంచి శిక్షణమందియుండి లక్షలకొలది సైనికులెల్లప్పుడు యుద్ధసన్నద్ధులుగానుండిరని చూచిన వారు వర్ణించినారు. విజయనగర సామ్రాజ్యము పూర్వహిందూసంప్రదాయముల ప్రకారము పరిపాలింపబడుచుండెను. సర్వమతములపట్ల సహనము చూపబడుచుండినను, రాజులు హిందూమతావలంబులై నేటి మైసూరువలె మతధర్మములపట్లను, గురుపరంపరపట్లను భక్తి చూపుచుండిరి. విద్యారణ్య గురుపరంపరపట్ల మర్యాద