కంపెనీ పరిపాలన యొక్క ఫలితములు
285
జీతముగల ప్రతియుద్యోగమునుండి భారతీయులను తీసివేసి ఆంగ్లేయులను హెచ్చుజీతములతో నియమింపసాగిరి. తరువాత నిది ప్రభుత్వములో నొక ముఖ్యవిధానముగా అమలు జరుగుచున్నది. ఈ యన్యాయము మాన్పుటకు జాతి, మత, వంశ, నివాసము లుద్యోగమున కనర్హత కలిగింప రాదను సూత్రమును 1833 వ సంవత్సరపు చట్టము శాసించినది. కాని దీనివలన భారతీయులకు న్యాయముకలుగలేదు సరికదా మొదట నేటివుల కొర కేర్పడిన యుద్యోగములందుకూడా ఆంగ్లేయులే నియమింపబడుట కీ నియమము నాధారము. జేసికొనిరి. ఇంగ్లాండులోనే నియమింపబడు కవనెంటెడ్ సర్వీస్ యుద్యోగులకును భారతదేశమున నియమింపబడు అన్‌కవనెంటడ్ సర్వీస్ యుద్యోగులకును గల ఘోర తారతమ్యము నెప్పటివలెనేయుంచిరి. నేటివు లెంత తెలివికలవారైనను విద్యావంతులైనను తెల్లవారితో సమానగౌరవమును పొందలేకుండాజేసిరి. 15 కోట్ల భారతీయ ప్రజలలో మూడు నాల్గువేలమందికి కొన్ని చిన్న యుద్యోగము లివ్వబడినను ఆ యుద్యోగములకు సగటున సాలుకు 300 రూపాయిలకన్న హెచ్చుజీతములు లేవు. ప్రభుత్వములో భారతీయుల కెట్టి పలుకుబడియులేదు. ఆఫ్రికా నీగ్రోలనుగూడా సలహాసంఘములోని కాహ్వానించి పరిపాలించుచున్నామని ప్రగల్భములు పలికిన ఆంగ్లరాజ్య నీతిజ్ఞులు, ఆంగ్లేయు లనాగరకులై అడవులలో చరియించునప్పటికే సకలకళలం దారితేరిన. భారతీయులకు వారిదేశ పరిపాలనలోనెట్టి ప్రవేశమును కలిగించుటలేదు.