పరిచయము
చరిత్రకారుఁడు సత్యశిల్పి. అతఁడు వాస్తవచరిత్రనే చిత్రించును. ఉన్నదున్నటులుగా చెప్పునదే చరిత్ర. అందు కల్లగాని కపటముగాని ఉండదు.
చరిత్రకారుఁ డనృతవాదిగాని పక్షపాతిగాని కాఁడు. అతఁ డట్టివాఁ డగునేని అతని జాతియంతయు అనృతమునఁబడి నీచజాతిగా మాఱును.
హిందూదేశము తెల్లవారిచేతులలోఁ బడెను. వారు తమ జయగీతములు పాడుకొని నల్లవారిచేఁగూడ పాడించు కొనిరి.
తెల్లవారు దొరలు, నల్లవారు బానిసలు. తెల్లవారు గురువులు, నల్లవారు శిష్యులు, తెల్లవారు గ్రంథకర్తలు, నల్లవారు అనువాదకులు.
చిన్ననాఁడు బడిలో నేను దేశచరిత్ర చదివితిని, హిందువులు నీచులనియు, తురకలు రాక్షసులనియు, తెల్లవారు దేవతలనియు నా కొక అభిప్రాయము కలిగెను. ఆ కాలమున నా తోడిబాలకు లందఱును ఈ చదువే చదివిరి.
"ఈ యేఁబది యేండ్లలో పుట్టిన దేశచరిత్రలకంటె నూఱు నూటయేఁబది యేండ్లకు మున్ను పుట్టిన దేశచరిత్రలలో ఏ యొండురెండో తక్క తక్కినవన్నియు పక్షపాతము లేనివనియు సమగ్రమయినవ”నియు సుప్రసిద్ధ చరిత్రకర్తలగు ఎడ్వర్‌డ్ థాంప్స౯, జి. టి. గారట్టులు వ్రాసిరి.