Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ

271


చినచో చాలునని అభిప్రాయముగూడ నిచ్చిరి ! గాని ఎట్టి సంస్కరణములును జరుగలేదు.

IV

1833లో కంపెనీవారికి మరల పరిపాలనాధికారపు పట్టా నిచ్చునప్పుడు భారతదేశమున న్యాయపరిపాలనా విధానము సంస్కరించుట యవసరమని గ్రహించి పార్లమెంటువారు 1833వ సంవత్సరపు కంపెనీ పట్టాచట్టమునుచేసి న్యాయపరిపాలనావిధానమును సంస్కరించుటకని మెకాలే నొక 'లా కమిషనరు'గా నియమించిరి. శాసనధర్మములను సంస్కరించి క్రోడీకరించు బాధ్యత నతనిపైనబెట్టిరి. పీనలుకోడ్ అను శిక్షాస్మృతిని మెకాలే నిర్మించినాడు. ఈ స్మృతి భారతీయప్రజల క్షేమ లాభములకు తోడ్పడలేదుగాని ఆంగ్లపరిపాలనను గట్టిపరచుటకుమాత్రము తోడ్పడెను. సామాన్యముగా నింగ్లాండులో శాసనాధికారమునుబట్టి ఎవడేమిచేసినను ఆ శాసనముప్రకారమే చేయవలెను. ఎవరైన కీడు కలిగించినచో దానికి నష్టపరిహార మివ్వవలెనో లేక శిక్షింపవలెనో అనునది జరిగిన హానినిబట్టి ఏర్పడును. మెకాలేచేసినశిక్షాస్మృతిలో నిండియాలో నెవ్వడైన తనకు అధికారముకలదని తలచి ఒకనికి హానికలిగించినచో అది శిక్షార్హమగు నేరముకాదని అధికారుల కొక గొప్ప విశేషాధికార మిచ్చినాడు ! ఇట్లే శాసనాధికారమును చలాయించుటలో నెవ డే హానిచేసినను చేయవచ్చుననుటయు గూడ అధర్మమేయని కలకత్తా బ్యారిష్టరు తియోబోల్డు 1885లో విమర్శించియున్నాడు. (Basu - Rise of Christian Power)