పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

5


సాగుచుండెను. ఇదిగాక దేశములో నాటువర్తకము విరివిగా జరుగుచుండెను.

షర్షా దేశములోని రాజబాటలనెల్ల బాగుచేసెను. కాని ఇతనికి రెండువంద లేండ్లక్రిందట దేశమును చూచిన ఇబిన్ బట్యూటా హిందువుల పరిపాలనలో నుండిన మలబారులోని బాటలెల్ల బాటసారుల కుపయోగకరముగా చెట్లనీడలతోను, అచ్చటచ్చట విశ్రాంతిగృహములతోను, నూతులతోను చాల సౌఖ్యముగా నుండెనని వర్ణించి యున్నాడు.

బేబరుచక్రవర్తి యీ దేశమునకు వచ్చి చూచిన నాటికి రివిన్యూ ఆదాయము వసూలు చేయు ఉద్యోగులు, వర్తకులు, పనివారు అందరును హిందువులుగ నుండిరని అతడే వ్రాసినాడు. (Erskine's Baber -232).

పోర్చుగీసువారు 1497 లో భారతదేశమునకు వచ్చిరి. వారి ముఖ్యోద్దేశమువ్యాపారలాభములార్జించుట. ఆనాటిపశ్చిమ దేశముల వ్యాపార మెల్ల కళ్ళికోటలోనే నెలకొని యుండెను. అచ్చటినుండి పెర్షియను జలసంధినుండి కన్‌స్టాంటినోపిలుకుగాని జెడ్డానుండి సూయజు ఆలగ్జాండ్రాలద్వారాగాని జర్గుచుండెను. అచ్చట వెనీసువర్తకులు భారతదేశ సరకులనెల్ల ఐరోపారేవుల కెగుమతి చేయుచుండిరి. ఆనాడు కళ్ళికోట ఒక అంతర్జాతీయ రేవుపట్టణముగ నుండెను. అచ్చట నొక (సీజను) వ్యాపార తరుణములో 1500 నౌకలు వచ్చి పోవుచుండెను. వివిధమతముల వారి కిచ్చట మతస్వేచ్ఛ యుండెను.